కామారెడ్డి, సెప్టెంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జడ్పీ చైర్ పర్సన్ శోభ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జిల్లా పరిషత్ సమావేశం జడ్పీ చైర్ పర్సన్ శోభ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలు, వాటిని పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం 100 శాతం పూర్తయ్యే విధంగా ప్రజా ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో రెండు కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసిన సందర్భంగా కేకు కట్ చేశారు.
అంతకుముందు వైద్యం, సాగునీరు, తాగునీరు, ఉపాధి హామీ, వ్యవసాయం తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ దొడ్డు రకం వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు మాట్లాడుతూ 2021-22 సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో 82.94 పని దినాలు కల్పించి రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. సహకరించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
పిట్లం జడ్పిటిసి సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి, రామరెడ్డి ఎంపీపీ దశరథ రెడ్డి మాట్లాడుతూ దొడ్డు రకం యూరియా సహకార సంఘాలకు పంపుతున్నారని, ప్రైవేటు డీలర్లకు సన్నరకం యురియా పంపుతున్నారని చెప్పారు. ప్రైవేటు డీలరులు అధిక ధరలకు యూరియను విక్రయిస్తున్నారని సభ దృష్టికి తెచ్చారు. ప్రైవేటు డీలర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు.
సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డీఎఫ్‌వో నిఖిత, సీఈఓ సాయి గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు పాల్గొన్నారు.