గురువారం నుంచి 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు ఈ నెల 16వ తేదీ నుంచి డోర్‌ టూ డోర్‌ సర్వే నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుండి ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌తో కలిసి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి మాట్లాడుతూ పంచాయతీరాజ్‌, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల చొరవతో ఇప్పటికే రెండు కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వడం జరిగిందని, అందుకు సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. అయితే గురువారం నుండి 18 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సినేషన్‌ వేసే కార్యక్రమాన్ని చాలెంజ్‌గా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. గ్రామ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీల కోఆర్డినేషన్‌తో గ్రామపంచాయతీ, స్కూల్‌ భవనం ముందు టెంటు వేయించి వ్యాక్సినేషన్‌ చేయించాలన్నారు.

అంగన్‌వాడి, ఆశాలు, ఏఎన్‌ఎంలు, మెడికల్‌ ఆఫీసర్‌, వార్డ్‌ మెంబర్స్‌, కౌన్సిలర్స్‌, వ్యాక్సినేషన్‌ చేయించే విధంగా చూడాలన్నారు. ప్రజల మధ్య పని చేసే వారు తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్‌ చేయుటకు రైతు వేదికలు ఉపయోగించుకోవాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ మాట్లాడుతూ మన రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చాలా బాగా జరిగిందన్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఆశ వర్కర్స్‌ సర్వే నిర్వహించి ఇంటిటికి స్టిక్కర్‌ను అతికించాలని, ఇంట్లో ఎంతమంది వ్యాక్సినేషన్‌ తీసుకున్నారు, తీసుకోని వారు స్టిక్కర్‌పై రాయాలన్నారు.

గ్రామాలలో టామ్‌ టామ్‌ చేయించాలని తెలిపారు. జడ్పీ చైర్మన్‌ దాదా అన్న గారి విఠల్‌ రావు మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 250 సబ్‌ సెంటర్లలో ప్రతి సబ్‌ సెంటర్లలో రోజుకో 125 మందికి వ్యాక్సినేషన్‌ చేసిన 20 రోజుల్లో ఆరు లక్షల మంది పూర్తి అవుతారని తెలిపారు. గ్రామపంచాయతీ, మండల, జిల్లా కమిటీలు వేయడం ద్వారా వారికి బాధ్యత ఉంటుందని అన్నారు.

జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ సబ్‌ సెంటర్లో వార్డు వారీగా, గ్రామపంచాయతీలో హ్యాబిటేషన్‌ వారీగా, మున్సిపాలిటీలో వార్డు వారిగా ప్లాన్‌ చేసుకొని గురువారం నుండి 18 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సినేషన్‌ చేస్తామన్నారు. జిల్లాలో రోజుకు పదివేల మందికి వ్యాక్సినేషన్‌ చేస్తున్నామని, 30 వేల మందికి చేయుటకు కెపాసిటీ ఉందన్నారు. లైన్‌ డిపార్ట్‌మెంట్స్‌తో సమావేశం నిర్వహించి వ్యాక్సినేషన్‌ వేగవంతం చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చిత్ర మిశ్రా, డిపిఓ, జయసుధ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »