నిజామాబాద్, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకునే ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ జిల్లాల కలెక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆయన శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే సంవత్సరం జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే అందరు కూడా ఓటర్ల జాబితాలో తమ పేర్ల నమోదు చేసుకోవాలని, ఈ నెల 27 నుండి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి బూత్ లెవల్ అధికారులను పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉండే విధంగా తగు ఆదేశాలు జారీ చేయాలని అదేవిధంగా మార్పులు చేర్పులతోపాటు కొత్తగా నమోదుకు సంబంధిత ఫారాలను పోలింగ్ కేంద్రాలలో ప్రజలకు అందించాలని పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్సు అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ, ఓటర్ల జాబితాల నుంచి మృతిచెందిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లు తొలగించాలని ఆదేశించారు. ఈనెల 27 నుంచి వచ్చే నెల 2 వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల భవనాలు శిథిలమైతే మరో భవనంలోకి మార్చాలని సూచించారు.
రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. బూత్ లెవల్ అధికారులు జాబితాల సవరణలో కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జాప్యం చేయకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ చిత్ర మిశ్రా, జెడ్పీ సీఈవో గోవింద్, డిఆర్‌డిఓ చందర్ నాయక్, డిసిఓ సింహాచలం అధికారులు పాల్గొన్నారు.