కామారెడ్డి, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ సభలో మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారంటూ టీఆర్‌ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 22వ రోజు పాదయాత్ర నిర్వహించారు.
టీఆర్‌ఎస్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలు ఎందుకు జరపడం లేదంటే అది మత తత్వమా అని బండి సంజయ్ ప్రశ్నించారు. 1400 మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ది చేకూరేలా పాలన జరుగుతోందంటే అది మత తత్వం అవుతుందా అని, కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని, ఆ పార్టీ చేతిలో టీఆర్‌ఎస్ కీలు బొమ్మగా మారిందని అంటే మత తత్వమా అని బండి సంజయ్ నిలదీశారు.
నిజాం పాలనలో రజాకార్ల ఆక్రుత్యాలను చెబితే అది మత తత్వం అవుతుందా, నిర్మల్‌లో వెయ్యి మందిని ఒకే చెట్టుకు ఉరి తీశారంటే అది మత తత్వమా అని బండి సంజయ్ ప్రశ్నించారు. మత రిజర్వేషన్లకు బీజేపి వ్యతిరేకం అని, టీఆర్‌ఎస్ – మజ్లిస్ పార్టీలను ఓడిరచినప్పుడే తెలంగాణకు అసలైన స్వేఛ్ఛ లభించినట్లవుతుందని చెప్పిన మాటలు మత తత్వమా? ఏది మత తత్వం? ఎవరు మత తత్వ రాజకీయాలు చేస్తున్నారు? అని టీఆర్‌ఎస్ పై నిప్పులు చెరిగారు.