నిజామాబాద్, సెప్టెంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పూర్తి సబ్సిడితో ఇచ్చే చిన్న తరహా వ్యాపార పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయము హైదరాబాద్ ప్రత్యేకాధికారి బి.ఆనంద్ కుమార్ తెలిపారు. శనివారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న తరహా వ్యాపార పథకాల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఇలాంటి వ్యాపారాలకు బ్యాంకుతో సంబంధం లేకుండా అమలు చేస్తున్నందున ఆయా పథకాలు మంజూరైన వారు యూనిట్లు నెలకొల్పి ఆర్థికంగా ఎదగాలని అభిలాషించారు. సంబంధిత యూనిట్‌పై ఆసక్తి లేని వారు పాడి గేదెలకు లేదా కుట్టు మిషన్లకు మార్చుకోవచ్చని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ అమలు చేస్తున్న వివిధ పథకాలైన భూమి కొనుగోలు పథకము, స్వయం ఉపాధి పథకము, శిక్షణ కార్యక్రమాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సమావేశంలో ప్రత్యేక అధికారి బి.ఆనంద్ కుమార్, జాయింట్ డైరెక్టర్ పశుసంవర్థక శాఖ, డా. భరత్ కుమార్, కార్యనిర్వహక సంచాలకులు డి.రమేష్, సహాయ కార్యనిర్వాహణ అధికారి జావిద్ అహ్మద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.