కామారెడ్డి, సెప్టెంబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య కార్యకర్తలు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేసే విధంగా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో వైద్య శాఖ అధికారులతో టెలీ కాన్పరెన్సులో మాట్లాడారు. ప్రతిరోజు ఆరోగ్య కార్యకర్త వందమందికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేసే విధంగా చూడాలన్నారు.
100 శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ పూర్తి చేసిన గ్రామాల ప్రజా ప్రతినిధులను వైద్య శాఖ ఆధ్వర్యంలో సన్మానం చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో వీఆర్ఏల సహకారం వైద్య సిబ్బంది తీసుకొని ఇంటింటి సర్వేను పూర్తిచేయాలని ఆదేశించారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు.
డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌వో పర్యవేక్షణ చేపట్టి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే విధంగా చూడాలని పేర్కొన్నారు. టెలీ కాన్ఫరెన్సులో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, వైద్య అధికారులు పాల్గొన్నారు.