నిజామాబాద్, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు మంచి దిగుబడులను లాభాలను పొందడానికి వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను వచ్చే యాసంగి నుంచి ప్రోత్సహించే ఉద్దేశంతో ఈనెల 24 నుండి 30వ తేదీ వరకు రైతు వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎం. గోవిందు తెలిపారు.
బుధవారం డిచ్‌పల్లి మండలం నడిపల్లి గ్రామంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన పంటల అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి పంట విస్తీర్ణం తగ్గించి అందుకు ప్రత్యామ్నాయంగా వచ్చే యాసంగి నుండి పొద్దుతిరుగుడు, శనగ, నువ్వులు, కందులు, జొన్న, మొక్కజొన్న వేరుశనగ తదితర పంటలను సాగు చేయించే ఉద్దేశంతో వారం రోజులపాటు రైతు వేదికల ద్వారా ప్రజలకు ఆ పంటల సాగు ద్వారా ఒనగూరే ప్రయోజనాలు, వచ్చే దిగుబడులు వాటిని విక్రయించడం ద్వారా లభించే ఆర్థిక వెసులుబాటును రైతులకు వివరించనున్నామని ఆయన తెలిపారు.
తద్వారా ఆ పంటలకు మంచి డిమాండ్ లభిస్తుందని రైతులు ప్రయోజనం పొందుతారని ఆయన పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాలలో రైతులు అందరిని భాగస్వామ్యం చేసి వారికి వ్యవసాయ, ఉద్యానవన, శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల చేకూరే ప్రయోజనాల గురించి వివరిస్తారని తెలిపారు. రైతులందరూ అవగాహన కార్యక్రమాలకు హాజరై అన్ని వివరాలు తెలుసుకోవడంతో పాటు వారికి గల సందేహాలను కూడా నివృత్తి చేసుకోవాలని ఆయన కోరారు.
సమావేశంలో ఉద్యానవన శాఖ ఉపసంచాలకులు నర్సింగ్ దాస్, హైదరాబాదు నుండి వచ్చిన ఉపసంచాలకులు చంద్రశేఖర్, కృషి విజ్ఞాన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ నవీన్, వ్యవసాయ శాఖ ఎ.డి. వాజిద్ హుస్సేన్, ఇతర ఏడిఏలు, ఎంఏఓలు, ఎంఈఓలు, ఉద్యానవన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.