నిజామాబాద్, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ నగరం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఎన్.ఎస్.యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నివాసంపై తెరాస నాయకుల దాడికి నిరసనగా కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు.
అనంతరం వేణురాజ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌కు ఎదుర్కోలేక కేటీఆర్ కొంతమంది తెరాస గుండాలను రేవంత్ ఇంటి ముట్టడికి పంపించారని, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన వ్యక్తం చేసే స్వేఛ్ఛ ఉంటుందని కానీ తెరాస నాయకులు కొంచెం హద్దులు మీరి రేవంత్ రెడ్డి ఇంటిపై భౌతిక దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ రెడ్డి అభిమానులు తెరాస నాయకులపై దాడి చేశారని అని ఆయన అన్నారు.
దమ్ముంటే కేటీఆర్, రేవంత్ రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్ స్వీకరించాలని, అంతే కానీ తెరాస లోని కొంతమంది రౌడీమూకలను పంపిస్తే ఊరుకునేది లేదని, చర్యకు ప్రతిచర్య తప్పదని ఆయన హెచ్చరించారు. గజ్వేల్‌లో కాంగ్రెస్ సభ విజయవంతమైందని కెసిఆర్, కేటీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని ఎలాగైనా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని నిలువరించాలని ఉద్దేశంతో ఇలా గూండాలను రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి ఇంటి పైన దాడి చేయించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని, కానీ ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని, చేతిలో అధికారం పోలీసు వ్యవస్థ ఉంది అని ఇష్టం వచ్చినట్టు రౌడీయిజం చేస్తే సహించేది లేదని, కాంగ్రెస్ శ్రేణులు క్రమశిక్షణ కలిగిన వారు కాబట్టి రాజ్యాంగం, చట్టాన్ని గౌరవిస్తూ సంయమనం పాటిస్తున్నారని మీరు దాన్ని మా చేతకానితనంగా తీసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని మేము కూడా జవాబు దీటుగా ఇస్తామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హుసేన్, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు జగన్, వంశీ, సాయి చంద్, రతన్, శశి, వినోద్, సూర్య, ప్రణయ్, పాల్గొన్నారు.