నిజామాబాద్, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొండ లక్ష్మణ్ బాపూజీ జీవిత గాథను భారతదేశంలోని ప్రతి పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ నాయకుడు కార్య దీక్షా పరుడు గొప్ప ఉద్యమ నేత బిసి ముద్దుబిడ్డ అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క 107వ జయంతి సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వినాయక నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు.
కొండా లక్ష్మణ్ బాపుజీ జీవిత చరిత్ర కేవలం తెలంగాణకు పరిమితం కాకూడదని భారతదేశంలోని ప్రతి ఒక్కరికి తెలియాలని నరాల సుధాకర్ అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుంటే ఎటువంటి కఠిన లక్ష్యాలనైనా ఛేదించే ధైర్యం వస్తుందని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాట పటిమ మరో మహాత్మా గాంధీని తలపిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కొరకు చేసిన త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ఒక శాసనసభ్యుడిగా, శాసనసభ ఉపనేతగా, మంత్రిగా, రాష్ట్రానికి ఎన్నో సేవలందించి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణ వచ్చిన తర్వాతనే పదవులు తీసుకుంటానని శపథం చేసిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు.
తొంభై ఏళ్ల వయసులో కూడా విశ్రాంతి తీసుకోకుండా బస్సు యాత్ర చేసి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ ఉద్యమ పాఠాలు నేర్పిన గొప్ప నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆనాడు స్వాతంత్రోద్యమంలో కానీ తెలంగాణ తొలి ఉద్యమంలో, తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాలు పంచుకుని ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, తన ఇంటిని తెలంగాణ ఉద్యమాలకు పుట్టినిల్లుగా మార్చి ఎందరికో వేదికగా తన ఇంటిని మార్చిన గొప్ప మార్గదర్శి కొండాలక్ష్మణ్ బాపూజీ అన్నారు.
కార్యక్రమంలో ధర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, గురుచరణం, బోడిగం గంగాధర్, కోడూరి స్వామి, సంజీవ్, అనిల్, శంకర్, బాలయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.