నిజామాబాద్, సెప్టెంబర్ 27:
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ వల్ల నిజామాబాదుతో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మూడు రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు తెలిపారు.
సోమవారం ప్రగతి భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ తుఫాన్ వల్ల ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులలోని ఇతర జిల్లాలలో కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిందని ఈ దిశగా జిల్లా అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తరఫున కోరారు.
గత కొన్ని రోజులుగా జిల్లాలో పలు మార్లు భారీ వర్షాలు కురిసినప్పటికీ జిల్లా యంత్రాంగం అధికారులు తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా విధులు నిర్వహించాలని ఆ అనుభవంతో ఇప్పుడు కూడా అటువంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఇరిగేషన్ రోడ్లు భవనాలు పంచాయతీ రాజ్ మున్సిపాలిటీ వ్యవసాయ తదితర లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా ప్రజలకు కానీ మూగజీవాలకు కానీ ఆస్తులకు కానీ ప్రమాదాలు నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ స్థానాల్లో ఉండి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
భారీ వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు విపత్తుల నివారణ, పునరావాస శాఖకు నివేదికలు పంపవలసి ఉన్నందున అధికారులు నిర్ణయించిన సమయానికి నివేదికలు పంపించాలని కోరారు. సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.