నిజామాబాద్, సెప్టెంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఉదయం నిజామాబాద్ కమీషనరేటు కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయా ఆదేశాల మేరకు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అదనపు డి.సి. (అడ్మిన్) మాట్లాడుతూ సకల జనులు, సబ్బండవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని జీవితాంతం పోరాడిన వ్యక్తి, సాయుధ పోరాట కాలంలో పెత్తందార్లను ఎదిరించిన వారికి న్యాయవాదిగా సేవలందించి, వారి తరపున న్యాయపోరాటం చేసిన ప్రజాస్వామిక వాది అని, గాంధీజి స్పూర్తితో దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లోనూ స్ఫూర్తిని నిలిపారని అన్నారు.
అనగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహాకార రంగాల పటిష్టత కోసం జీవితమంతా కృషి చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరు బంగారు తెలంగాణ కోసం శ్రమించాలని, భవిష్యత్ తరాలకోసం అనునిత్యం ప్రతి ఒక్కరు కష్టపడాలని భావి తరాల కోసం బంగారు బాట వేయాలని పోలీస్ శాఖ సిబ్బందికి అదనపు డి.సి.పి (అడ్మిన్) పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) ఉషా విశ్వనాధ్ తిరునగరి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ రాజరాజేశ్వర్, సిబ్బంది హాజరయ్యారు.