కామారెడ్డి, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో గురువారం నుంచి కేంద్ర బృందం పర్యటన ఉన్నందున ఉపాధి హామీ పనులకు సంబంధించిన అన్ని రికార్డులు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా మండల స్థాయి అధికారులతో మాట్లాడారు.
అధిక ఖర్చుతో చేసిన పనులను గుర్తించి వాటికి సంబంధించిన రికార్డులు, పని చేసిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి మండలానికి మూడు రూట్ మ్యాప్‌లను అధికారులు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వర్క్ ఫైల్స్ పెండిరగ్ లేకుండా చూడాలన్నారు. ఎలాంటి సందేహాలున్నా గ్రామస్థాయి అధికారులు మండల స్థాయి అధికారులకు తెలియజేసి నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు.
అధిక పనులు జరిగిన రామారెడ్డి, నాగిరెడ్డిపేట, మాచారెడ్డి, గాంధారి, నిజాంసాగర్ మండల అధికారులు గ్రామాల వారీగా రికార్డులను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామపంచాయతీలో 30 మంది కూలీలకు అవగాహన కల్పించి, వారు కేంద్ర బృందంతో మాట్లాడే విధంగా చూడాలన్నారు. రైతు వేదిక, కంపోస్ట్ షెడ్డు, పల్లె ప్రకృతి వనం, ఊర చెరువుల వంటి నిర్మాణాల వద్ద వర్క్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జెడ్పీ సీఈవో సాయా గౌడ్, డిపిఓ సునంద, ఏపీడిలు సాయన్న, శ్రీకాంత్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.