నిజామాబాద్, సెప్టెంబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రజలు అంటురోగాల బారిన పడకుండా నివారణ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుండి సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలతో పారిశుద్ధ్యం పేరుకుపోయి ఉండే అవకాశం ఉందని అదేవిధంగా ప్రజల ఆవాసాలలో చెడు నీరు ఆగి ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉన్నందున ఈ దిశగా నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
రెండు రోజుల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిర్వహించాలని శుభ్రం చేయాలని, ఎక్కడైనా ప్రజల ఆవాసాల వద్ద నీరు నిలిచి ఉంటే తొలగించడానికి చర్యలు తీసుకోవాలని చెత్తాచెదారం శుభ్రం చేయాలని తెలిపారు అదేవిధంగా త్రాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున మిషన్ భగీరథ పైపులు ఎక్కడైనా దెబ్బతిని ఉంటే గుర్తించి వాటిని సరిచేయాలని, స్థానిక నీటి అవసరాల ద్వారా సరఫరా చేసే నీరు కూడా కలుషితం కాకుండా పైపు లైన్‌లు దెబ్బతిన్న చోట గుర్తించి సరిచేయాలని అన్ని రకాల నీటి ట్యాంకులు క్లోరినేషన్ చేసి ప్రజలకు పరిశుభ్రమైన త్రాగు నీటిని సరఫరా చేయాలని జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
వర్షాల వల్ల గ్రామ పంచాయతీ, మున్సిపల్, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బి రోడ్లు దెబ్బతిన్న వాటిని గుర్తించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. రూ. 50 వేల లోపు మరమ్మతులకు పంచాయతీ, మున్సిపాలిటీల నిధులను వెచ్చించాలని అంతకుమించి ఖర్చు కావలసి ఉంటే జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.
రోడ్లు తెగిపోయిన చోట ప్రమాదాలు జరగకుండా యాక్సిడెంట్ ప్రోన్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సెల్ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్/ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.