ఆర్మూర్, సెప్టెంబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యునివర్సిటీలో 2017 నుండి నేటి వరకు జరిగిన టీచింగ్-నాన్ టీచింగ్ పోస్టుల నియామకంపై విచారణ జరిపి వాటిని రద్దు చేసి నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌లు విడుదల చేసి నియామకాలు జరుపాలని ప్రగతి శీల యువజన సంఘం (పివైఎల్) రాష్ట్ర నాయకులు సుమన్ డిమాండ్ చేశారు.
ఆర్మూర్‌లో కుమార్ నారాయణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ యునివర్సిటీ ప్రతిష్టను మసక బార్చే విధంగా అక్రమ నియామకాలకు కేరాఫ్ అడ్రస్‌గా యూనివర్సిటీని మారుస్థున్నారని వారు విమర్శించారు. గతంలో వీసీ సాంబయ్య హయంలో నాన్ టీచింగ్ ఉద్యోగాలను అక్రమంగా అమ్ముకుంటె ఆనాడు అక్రమ నియామకాల రద్దుకై పోరాడితే రద్దు చేశారని యూనివర్సిటీ గాడిలో పడుతుందని ఆశిస్తున్న తరుణంలో మళ్లీ నేడు విసిగా రవీందర్ గుప్తా, రిజిస్ట్రార్‌గా కనకయ్యల నియామకం తర్వాత మళ్లీ అదే పద్ధతిలో నాన్ టీచింగ్ పోస్ట్‌ల నియామకం జరిపారని ఇలాంటి అక్రమ నియామకాల వల్ల నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని అన్నారు.
ఒకవైపు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌లు లేక సతమతమవుతున్నారని కనీసం ఇలాంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలకైనా అందులో స్థానికులకు తొంభై శాతం అవకాశం కల్పించి నోటిఫికేషన్‌లు ఇచ్చి భర్తీ చేస్తే కొంతమెరకైన బాగుండేది కానీ వీటిని కూడా ఎలాంటి నోటిఫికేషన్‌లు లేకుండా మళ్లీ అక్రమంగా భర్తీ చేశారని అన్నారు.
అసలు 2017 నాటి నుండే టీచింగ్‌కు సంభందించి అకడమిక్ కన్సల్టెంట్ల నియామకంలో కుడా అర్హతలు లేనివారికి కూడ ఇచ్చారని కాబట్టి నాటి నుండి నేటి వరకు జరిపిన అన్ని నియామకాలపై విచారణ జరిపి వాటిని రద్దు చేసి ప్రభుత్వ, యూజీసీ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌లు ఇచ్చి భర్తీ చేయాలని అట్లాగే యూనివర్సిటీ ఆర్థిక లావాదేవీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పివైఎల్ నాయకులు శ్రీనివాస్, మనోజ్, రాజు, సాయి కుమార్ పాల్గొన్నారు.