నిజామాబాద్, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎం.ఏ., ఎం.కాం., ఎంఎస్సి, ఎంబిఏ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల 200 రూపాయల అపరాధ రుసుముతో 13 అక్టోబర్ వరకు గడువు పెంచినట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ డా.యన్.అంబర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందులో డిగ్రీ ప్రవేశానికి ఇంటర్మీడియేట్, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్ (డిప్లమా), రెండు సంవత్సరాల ఐటిఐ, టెన్ ప్లస్టు తత్సమాన అర్హతలు కలిగి ఉండాలని, పీజీ ప్రవేశానికి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలన్నారు. చదువుకోవడానికి ఆసక్తి ఉండి రెగ్యులర్గా చదువుకోలేక పోతున్న గృహిణులు, ఉద్యోగులు, మధ్యలోనే చదువు ఆపేసిన అన్ని వయసుల అభ్యర్థులకు ఇదొక సదవకాశమని తెలిపారు.
బి-టెక్, బి.ఫార్మసీ, కోర్సులు చదవిన విధ్యార్థులు కూడా ఓపెన్ వర్సిటీలో పీజీ కోర్సు ఎం.ఏ. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ సోషియాలజీ, ఇంగ్లీష్, సైకాలజీ, జర్నలిజం, కోర్సులలో అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, పీ.జీ పాసైన వారు కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా ఉద్యోగ అవకాశాలకు అర్హులన్నారు.
అడ్మీషన్ పొందాలనుకునే వారు అక్టోబర్ 13వ తేదీ లోపు మీ దగ్గరలో ఉన్న మీ- సేవా కేంద్రం లేదా టి.ఎస్. ఆన్ లైన్లలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ చేసుకొని తగిన రుసుము చెల్లించిన తరువాత అప్లికేషన్ ప్రింట్ అవుట్లను రీజినల్ కార్యాలయం గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్లో అందజేయాలన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ భారీ వర్షాల కారణంగా సెప్టెంబర్ 28,29 న తేదీల్లో వాయిదా వేసిన పీజీ పరీక్షలు తిరిగి అక్టోబర్ 23, 24 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని, రీజినల్ కార్యాలయం గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాద్ నందు సంప్రదించాలన్నారు.