ఆర్మూర్, అక్టోబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ స్వాతంత్య్రం కోసం సర్వం త్యాగం చేసిన సమరయోధుల నుంచి ప్రస్తుతతరం స్పూర్తి పొందాలని ఆర్మూర్ ఆర్‌డివో వి.శ్రీనివాసులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో నిజామాబాద్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను శుక్రవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.
ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్చా జీవితాన్ని అనుభవిస్తున్నామన్నారు. స్థానిక మునిసిపల్ ఛైర్‌పర్సన్ పండిట్ వినీత మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల గురించి విద్యార్థులు తెలుసుకొని భవిష్యత్తులో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఎంపిపి పస్కనర్సయ్య మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల గురించి ప్రతి తరానికి తెలియజేయడానికి విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
నిజామాబాద్ ఫీల్డ్ పబ్లిసిటి ఆఫీసర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ మూడు రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ జగదీశ్వర్, తహసీల్దార్ వేణుగోపాల్, వ్యవసాయ మార్కెట్ యార్డు సెక్రెటరీ భారతి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.