ఆడపడుచులకు కానుక బతుకమ్మ చీర

గాంధారి, అక్టోబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా మీ తోబుట్టువు ముఖ్యమంత్రి కెసిఆర్‌ చీరలను అందిస్తున్నారని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. శనివారం గాంధారి మండల కేంద్రంలో ఎంపీపీ రాదా బలరాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమ సమావేశానికి ముఖ్యఅథితిగా హాజరైయ్యారు.

ఈ సందర్బంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. సమావేశంలో స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ తెలంగాణలో ఒక కోటి ఐదు లక్షల మంది మహిళలకు 350 కోట్ల రూపాయలు వెచ్చించి బతుకమ్మ చీరలను అందజేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ పండుగ అయిన బతుకమ్మ సంబరాల సందర్బంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ సొంత తోబుట్టువు లాగా చీరలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సూచన ప్రకారం పండుగ ప్రారంభం కావడానికి ముందుగానే గాంధీ జయంతి అయిన అక్టోబర్‌ 2 వ తేది నుండి రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించామని అన్నారు.

నేటి నుండి 6వ తేది వరకు బతుకమ్మ చీరలను ఆయా గ్రామాలలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఆడపడుచులకు ప్రేమతో అందిస్తున్న కానుకగా ప్రతి మహిళా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రేమతో కడుపు నిండా కారం అన్నం పెట్టినా నిండుతుందన్నారు. మీరంతా నా ఆత్మీయులు అని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విదంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్‌ అని కొనియాడారు. కల్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్నామని తెలిపారు.

మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. రైతు బీమా ద్వారా ఆకస్మికంగా చనిపోయిన రైతు కుటుంబ సభ్యులకు 5 లక్షలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. గతంలో 200 పెన్షన్‌ను ఇప్పుడు 2 వేలకు పెంచామని, వికలాంగులకు పెన్షన్‌ 3 వేలు అందిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ ఇచ్చేవారని ఇప్పుడు తెలంగాణలో 12 వేల కోట్లు పెట్టి 42 లక్షల మందికి పెన్షన్‌ అందజేస్తున్నామని అన్నారు.

ప్రధాని మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 600 రూపాయలు పెన్షన్‌ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కరోనా కారణంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గినా అభివృద్ధి మాత్రం ఆగలేదని తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రతి పండుగకు అన్ని మతాల వారికి బట్టలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడిలలో గర్భిణీలకు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలిపారు. ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాం.. ఇంకా చేయాలి.. చేస్తామని హామీ ఇచ్చారు. గాంధారి మండలంలో ఇప్పటి వరకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదని, త్వరలో ఎమ్మెల్యే సురేందర్‌, ఎంపీ బీబీ పాటిల్‌ ను ముఖ్యమంత్రి కెసిఆర్‌ దగ్గరకు స్వయంగా తీసుకొని వెళ్లి ఇండ్లు మంజూరు చేయిస్తానాని భరోసా ఇచ్చారు.

ఇండ్లను మహిళల పేరుమీదే మంజూరు చేస్తామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో పేద వారిని గుర్తించి జాబితా తయారు చేయాలనీ సూచించారు. అంతకుముందు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ మాట్లాడుతూ తెలంగాణలో హరిత నిధి ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ ముందుకు వచ్చారని అన్నారు. హరితహారం ద్వారా గ్రామాలు పచ్చదనంతో చల్లగా ఉన్నాయని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కృషితో గ్రామాలు పచ్చగా ఉన్నాయని అన్నారు.

బతుకమ్మ పండుగ సందర్బంగా ప్రతి ఆడపడుచుకు కానుకగా చీరను అందజేస్తున్న కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కెసిఆర్‌ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆడపడుచులు దీవించాలని కోరారు. తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, ఉపాధి హామీలో సైతం ముందువరుసలో ఉందని అన్నారు. 22 ప్యాకేజీ ద్వారా వ్యవసాయనికి సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు.

జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ మాట్లాడుతూ మంత్రి కేటిఆర్‌ కృషితో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి జుట్‌ మిల్‌ పరిశ్రమ మంజూరైందన్నారు. దీంతో స్థానికంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. స్థానిక జడ్పీ పాఠశాల ఆవరణలో గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బతుకమ్మ చీరలను మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి, జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌, స్థానిక సర్పంచ్‌ సంజీవ్‌ యాదవ్‌, నాయకులు తానాజీ రావు, ముకుంద్‌ రావు, శివాజీ రావు, సత్యం, సాయికుమార్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »