నిజామాబాద్, అక్టోబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్రాన్ని సాధించడంలో గాంధీజీ పాటించిన అహింసా మార్గమే ప్రతి ఒక్కరికి అనుసరణీయం అని దాని ద్వారా దేనినైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు.
జాతిపిత మహాత్మ గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం నగరంలోని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు మనమందరం ఒక మంచి స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నామంటే, మనకు కావలసిన విధంగా మన భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నామంటే గాంధీజీ నాయకత్వంలోని ఎంతోమంది మహాత్ముల పోరాట పుణ్యమేనని పేర్కొన్నారు. భారతదేశానికి అందించిన స్వాతంత్రమే ఏకైక ఉద్దేశ్యంతో బ్రిటిష్ గవర్నమెంట్‌తో పోరాడి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా జైలుకు వెళ్లి అనేక కష్టనష్టాలు ఓర్చి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే విధంగా అహింసా మార్గం ద్వారా అవిశ్రాంతంగా పోరాటం చేశారని పేర్కొన్నారు.
మన దేశం అనేక రంగాలలో ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంటూ దూసుకెళుతున్నదని, ముఖ్యంగా కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ కనుగొనడంలో భారతదేశం ముందంజలో ఉండి ఎన్నో దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసిందన్నారు. మన జాతి నాయకుల కలలు నిజం చేస్తూ వారి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు.
ప్రభుత్వాలు సంక్షేమం, అభివృద్ధి రంగాలలో పలు పథకాలు, కార్యక్రమాలు తీసుకొస్తూ ప్రజలు వారి కాళ్ళ మీద వారు నిలబడి అభివృద్ధి పథంలో నడిచే విధంగా అవకాశాలు కనిపిస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నానని అన్నారు. అంతకుముందు ఆజాద్ కి అమృత్ ఉత్సవాలలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 2 కె రన్ ర్యాలీని అడిషనల్ కలెక్టర్ / ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు.
ర్యాలీని గాంధీ చౌక్ నుండి కలెక్టరేట్ గ్రౌండ్ వరకు నిర్వహించారు. ఎన్‌సిసి 7వ బెటాలియన్, ఎన్‌వైకె యూత్, స్కూల్ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ మకరంద్, డిఎస్‌పిఓ ముత్తన్న, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.