నిజామాబాద్, అక్టోబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం: 60 ప్రకారం మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్ నెల నుండి వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్‌టియు, ఏఐటియుసి, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో రేపటి ఛలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ అన్నారు.
ఈ మేరకు ఆదివారం శ్రామికభవన్ కోటగల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచుతూ జూన్ నెలలో జీవో నెంబర్ 60 విడుదల చేసిందన్నారు.
జీవో ప్రకారం వివిధ కేటగిరీల వారీగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెరగాల్సి ఉండగా కానీ నేటికీ అమలు కాకపోవడం దుర్మార్గమన్నారు. వెంటనే కేటగిరీల వారీగా వేతనాలు పెంచుతూ వచ్చిన జీవో నంబర్ 60ని మున్సిపల్ కార్మికులకు అమలు చేయాలని డిమాండ్‌తో ఐఎఫ్‌టియు, ఏఐటియుసి, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీ కార్మిక ప్రదర్శన చేస్తున్నామన్నారు.
చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు పిలుపునిస్తున్నామన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కే.రాజేశ్వర్, తిరుపతి, శివకుమార్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.