నిజామాబాద్, అక్టోబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని గ్రామాలకు బతుకమ్మ చీరలు పంపించి పంపిణీ జరిగేలా చూడాలని 70 శాతం పూర్తయిన వ్యాక్సినేషన్ మరో వారం రోజుల్లో 100 శాతం జరిగేలా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు.
సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్, సీజనల్ వ్యాధులు, వరి ధాన్యం సేకరణ, బతుకమ్మ చీరల పంపిణీ, ఉచిత చేప పిల్లల పంపిణీ, హరితహారం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వ్యాక్సినేషన్ 70 శాతం రీచ్ కావడం మంచి పరిణామమని వారం చివరి నాటికి 100 శాతం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
మున్సిపల్ వార్డుల వారీగా, గ్రామపంచాయతీల వారీగా వ్యాక్సినేషన్ జరగాలన్నారు. సీజనల్ డిసీజెస్ అరికట్టాలని, డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలలో కమిషనర్ల సహకారం తీసుకోవాలని డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వారిని ఉపయోగించుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఒక డ్రైవ్ లాగా నిర్వహించాలని, మెడికల్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో వెళ్లి పంచాయతీలు, మున్సిపాలిటీల కోఆర్డినేషన్‌తో పని చేస్తే రిజల్ట్ వస్తుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు సెంటర్ల ఏర్పాటుకు పక్కా ప్రణాళిక చేసుకోవాలని గన్ని బ్యాగ్స్, తాటిపత్రులు, తేమ కొలిచే యంత్రాలు, తూకం కాంటాలు సరిపోయే విధంగా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలన్నారు.
బతుకమ్మ చీరలు పంపిణీ గ్రామపంచాయతీ వారిగా రేపటినుండి వెళ్తాయని 9వ తేదీ వరకు పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు. 2 అక్టోబర్ నుండి 14 నవంబర్ వరకు నిర్వహించనున్న పాన్ ఇండియా ప్రోగ్రాం చట్టాలపై గ్రామాలలో అవగాహన ప్రోగ్రాంలో ప్రజల సమస్యలపై వివిధ చట్టాల గురించి అవగాహన కల్పిస్తారని సమస్యలను కూడా పరిష్కరిస్తారని తెలిపారు. ప్రాజెక్టులు చెరువులలో ఉచిత చేప పిల్లల పంపిణీ అధిక వర్షాల వల్ల ఆలస్యమైనందున ఈ నెల ఆఖరి వరకు పూర్తి చేయాలని తెలిపారు.
హరితహారం జిల్లా, డివిజన్, మండలం, గ్రామం ఆఫీసుల వారిగా రైతు వేదికలు, విద్యుత్తు సబ్ స్టేషన్లలో నాటిన మొక్కలు బ్రతకాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్/ ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.