గాంధారి, అక్టోబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలో గంజాయి సాగు యథేచ్ఛగా కొనసాగుతుంది. మండలంలోని తండాలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా గంజాయి సాగు మాత్రం ఆగడం లేదు. మూడురోజుల క్రితం కాయితి తండాలో గంజాయిని గుర్తించి ధ్వంసం చేసిన అధికారులకు తాజాగా మరో సమాచారం అందడంతో షాక్‌కు గురైయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి…
మండలంలోని కొత్తబాది తండాలోని వ్యవసాయభూమిలో గంజాయి సాగు చేస్తున్నారని సోమవారం సాయంత్రం అధికారులకు సమాచారం అందింది. కామారెడ్డి టాస్క్ ఫోర్స్ సీఐ జాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ఎక్సయిజ్ అధికారులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సోమవారం రాత్రి వరకు గంజాయి పండిస్తున్న భూమి వద్ద విచారణ చేపట్టారు. మక్కజొన్న పంటలో అంతర పంటగా గంజాయిని సాగుచేస్తున్నట్లు గుర్తించారు.
మంగళవారం ఉదయం మళ్ళీ సదాశివనగర్ సీఐ వెంకట్, స్థానిక ఎస్‌ఐ శంకర్ పోలీస్ సిబ్బంది, ఎల్లారెడ్డి ఏక్సైజ్ అధికారులు కలిసి గంజాయి సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రం వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. స్థానిక తహసీల్దార్ గోవర్ధన్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. సర్వే నెంబర్ 113 లో సుమారు ఎకరం భూమిలో గంజాయి సాగు చేస్తున్నట్లు తహసీల్దార్ పంచనామా చేశారు.
వ్యవసాయ భూమి ఎవరిది, ఎవరు మొక్కజొన్నలో గంజాయి పండిస్తున్నారో విచారణ చేపట్టారు. గంజాయి పంటను చూసి అధికారులు ఆశ్చర్య పోయారు. ఉదయం నుండి సాయంత్రం వరకు గంజాయి పంటను పెకిలించినా సమయం సరిపోలేదంటే ఏ మేరకు గంజాయి పండిస్తున్నారో అర్థం అవుతుంది. అధికారులు, సిబ్బంది గంజాయి మొక్కలు పెకిలించి ధ్వంసం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు లావుని పట్టా భూమిలో గంజాయి సాగు చేస్తున్నట్లు, ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్, ఎక్సైజ్ అధికారులు తెలిపారు.