పోడుభూముల సమస్యపై నిరంతర పోరాటం

గాంధారి, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో ప్రధాన సమస్య అయిన పోడుభూములపై పోరాటం నిరంతరాయంగా కొనసాగుతుందని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి అన్నారు. అఖిలపక్షం, టీపీసీసీ పిలుపుమేరకు మంగళవారం గాంధారి మండల కేంద్రంలో నెహ్రు చౌరస్తా వద్ద పోడుభూముల సమస్యలపై ధర్నా నిర్వహించారు.

కార్యక్రమంలో పాల్గొన్న సుభాష్‌ రెడ్డి మాట్లాడుతూ దళిత గిరిజనుల సమస్యల పరిస్కారం కొరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడి ఏడున్నర సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా ఉందన్నారు. గిరిజనుల పోడుభూముల సమస్యలు పరిషరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పోడుభూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు అందించి, పాసు పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

పోడు రైతులకు పాసుబుక్‌ ఇవ్వడం ద్వారా వారికి దళిత బంధు, దళిత భీమా వర్తిస్తుందని అన్నారు. పోడు రైతుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అన్యాయం చేస్తున్నారని అన్నారు. పట్టాలు ఇవ్వకుండా కందకాలు తవ్వి పోడు రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బాగుపడతామని అనుకున్న యువత అన్యాయానికి గురైందన్నారు. తెలంగాణ కెసిఆర్‌ కుటుంబమే బాగుపడిరదని అన్నారు. తెలంగాణ ఏర్పడితే లక్ష ఉద్యోగాలు, డబుల్‌ బెదురూమ్‌ ఇల్లు, లక్ష రుణమాఫీ అన్నారని, ఇపుడు ఒక్క హామీ అమలు కాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ నియోజకవర్గ అభివృద్ధి కొరకు అమ్ముడుపోయానని చెప్పి, ఏమి అభివృద్ధి చేశారో తెలపాలన్నారు.

నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్వంత అభివృద్ధి కోసమే అమ్ముడుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి పంటలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో దళిత, గిరిజనుల సమస్యలపై ఎమ్మెల్యే సీతక్క పోరాడుతుందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పోడు భూముల సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మెడలువంచి సమస్యలు సాధించుకుందామని అన్నారు. నియోజకవర్గానికి జూట్‌ మిల్లు మంజూరు అయిందని ప్రభుత్వం చెబుతుందని, కానీ ఆ మిల్లు ఏర్పాటుకు దళిత గిరిజనుల భూమిని లాక్కొని ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. భూమి కల్గిన వారికి నష్ట పరిహారం ఇచ్చిన తర్వాతే మిల్లు ఏర్పాటు చేయాలనీ అన్నారు. కొత్త వారికి పింఛన్లు ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వం అని, రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం స్థానిక చౌరస్తా వద్ద సడక్‌ బంద్‌ చేపట్టారు. రాస్తారోకో సందర్బంగా ఇరువైపులా వాహనాలు నిలిచి పోయి, ట్రాఫిక్‌ ఇబ్బంది కలిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు తూర్పు రాజులు, ఎంపీటీసీ బాలరాజ్‌, లక్ష్మణ్‌, రవి, మహేందర్‌, అన్ని మండలాల నాయకులు, అఖిలపక్ష నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »