కామారెడ్డి, అక్టోబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో వచ్చే గోదావరి జలాలు మురికి నీరు కంటే అధ్వానంగా రావడం జరుగుతుందని, ఈ నీళ్లు తాగితే ప్రజలకు భయంకరమైన రోగాలు వస్తాయని కామారెడ్డి జిల్లా బిజెపి మీడియా అనుబంధాల కన్వీనర్ విశ్వనాధుల మహేష్ గుప్తా అన్నారు.
మున్సిపల్ అధికారులు మంచినీరు సరఫరా చేయాల్సింది పోయి మురికి నీరు సరఫరా చేయడం సిగ్గుచేటని ప్రజల నుండి లక్షల్లో పన్నులను విధించి ఇలాంటి నీటిని నల్లాల ద్వారా అందజేయడం వీరికున్న చిత్తశుద్ధికి నిదర్శనం అని ఆరోపించారు.
ఈ నీటిని ఏ మున్సిపల్ అధికారులు తాగడానికి వస్తారని ఈ నీటిని తాగే ధైర్యం ఏ అధికారికైనా ఉందా అని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో రోజురోజుకీ డెంగ్యూ మలేరియా కేసులు పెరుగుతుంటే మంచి నీరు అందించాల్సింది పోయి నిర్లక్ష్యంగా గత నెల రోజుల నుండి ఈ రకమైన నీటిని సరఫరా చేయడం సరికాదన్నారు. అధికారులు తక్షణమే స్పందించి నీటిని శుభ్రపరచి మంచి నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.