కామారెడ్డి, అక్టోబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవంబర్ 1న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో శుక్రవారం జిల్లా రాజకీయ పార్టీలతో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2022 పై సమావేశం ఏర్పాటు చేశారు.
సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై రాజకీయ పార్టీల నాయకులతో చర్చించారు. ఎల్లారెడ్డిలో 269, కామారెడ్డిలో 266, జుక్కల్ లో 255 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో పదిహేను వందల మంది ఓటర్ల కంటే ఎక్కువగా ఉంటే మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే వీలుందని సూచించారు.
జిల్లా ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు మాట్లాడుతూ ఓటర్లకు ఒకటిన్నర కిలోమీటర్ల కంటే దూరం ఎక్కువగా పోలింగ్ కేంద్రం ఉంటే కొత్తగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో మృతిచెందిన వారి పేర్లు, కొందరి పేర్లు రెండు బూతుల్లో ఉన్నాయని అధికారుల దృష్టికి తెచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల పేర్లు రెండు పోలింగ్ కేంద్రాలలో ఉన్నాయని పేర్కొన్నారు. సమావేశంలో బాన్సువాడ ఆర్‌డిఓ రాజాగౌడ్, ఎన్నికల సూపరింటెండెంట్ వరప్రసాద్, సీనియర్ సహాయకుడు రవికుమార్, టెక్నికల్ సహాయకులు నరేందర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.