నిజామాబాద్, అక్టోబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీనియర్ జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు వహీద్ కరోనా సమయంలో మన అందరికీ దూరమైన సందర్భంలో వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారి పేరుమీద జాతీయస్థాయి ఫుట్‌బాల్ టోర్నీని ఈ నెల 12 తేదీ నుండి 17వ తేదీ వరకు నాగారం రాజారాం స్టేడియంలో నిర్వహిస్తున్నట్టు కార్యక్రమ కార్యనిర్వాహక కార్యదర్శి నరాల సుధాకర్ తెలిపారు.
టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ మైదానంలో సాయంత్రం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొననున్నారని తెలిపారు. వహీద్ నిజామాబాద్ క్రీడకు అందులో ఫుట్‌బాల్ క్రీడకు ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. నిజామాబాద్ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో కానీ జాతీయ స్థాయి ఎక్కడికి వెళ్లినా వారిని ఒక తండ్రిలాగా ఉండి చూసుకునేవాడిని గుర్తు చేశారు.
నేటి నుండి ప్రారంభమయ్యే టోర్నమెంట్ లీగ్ కం నాకౌట్ పద్ధతిలో కొనసాగుతుందని తెలిపారు. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయని, మధ్యప్రదేశ్, చెన్నై మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేర్ ఫుట్‌బాల్ అకాడమీ టీమ్‌లు పాల్గొంటాయని అన్నారు.
కార్యక్రమంలో కేర్ ఫుట్‌బాల్ అకాడమీ అధ్యక్షుడు నరాల సుధాకర్‌తో పాటు ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఆంద్యాల లింగం, ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శఖీల్, జిమ్నాస్టిక్ జిల్లా అధ్యక్షులు సాయగౌడ్, ఫుట్‌బాల్ కోచ్ గొట్టిపాటి నాగరాజు, కొయ్యాడ శంకర్, జావేద్ పాల్గొన్నారు.