పంట రుణాల మంజూరులో మంచి ప్రోగ్రెస్‌, అభినందనలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి ప్రజలను రైతులను ఎన్నో విధాలుగా బాధించినప్పటికీ బ్యాంకర్లు అండగా ఉండి రుణాల మంజూరులో మంచి ప్రోగ్రెస్‌ సాధించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు.

సెప్టెంబర్‌తో ముగించే రెండవ త్రైమాసిక ముగింపును పురస్కరించుకొని బ్యాంకర్ల డిసిసి, డిఎల్‌ఆర్‌సి సమావేశాన్ని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పంట రుణాల కింద గత సంవత్సరం 64 శాతంతో 1315 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేయగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 79 శాతంతో 1683 కోట్ల రూపాయలు మంజూరు చేయడం రైతులకు మరింత బాసటగా నిలిచినట్లు అయ్యిందని ఇందుకుగాను మంచి ప్రోగ్రెస్‌ చూపించిన ఎస్‌బిఐ, గ్రామీణ బ్యాంకు తదితర బ్యాంకు అధికారులను అభినందిస్తున్నానని తెలిపారు.

మరోవైపు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా యూకో బ్యాంక్‌ తదితర బ్యాంకులు అనుకున్న మేర ప్రోగ్రెస్‌ లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా బ్యాంకులు కూడా ముందు ముందు రోజుల్లో మిగతా బ్యాంకులతో సమానంగా రైతులకు రుణాలు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని లేదంటే వారి వద్ద కొనసాగుతున్న ప్రభుత్వ శాఖల డిపాజిట్లు బ్యాంక్‌ ఖాతాలను మంచి ప్రోగ్రెస్‌ ఉన్న బ్యాంకులకు బదిలీ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత, ప్రాధాన్యేతర విభాగాలకు కల్పి 7369 కోట్ల రూపాయల లక్ష్యానికి గాను సెప్టెంబర్‌ వరకు 3602 కోట్ల రూపాయలతో సుమారు 49 శాతం లక్ష్యాన్ని సాధించారని ఇంకా సమయం ఉన్నందున లక్ష్యానికి అనుగుణంగా అన్ని బ్యాంకులు రుణాల మంజూరుకు సహకారం అందించి తద్వారా ప్రజలు, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చేయూత అందించాలని ఆయన కోరారు. ఈ నెల ఆఖరి వరకు వానాకాలం సీజన్‌ పూర్తయి యాసంగి సీజన్‌ మొదలుకానున్న వీలైనంత త్వరగా రైతులకు రుణాలు అందించడం ద్వారా వారు సకాలంలో పంటల వైపు వెళ్లడానికి వీలవుతుందని పేర్కొన్నారు.

ఫసల్‌ బీమా యోజన క్రింద అ ప్రీమియం మొత్తాలను రైతులకు తెలియకుండానే బ్యాంకర్లు రైతుల ఖాతాల నుండి వారి ఆప్షన్‌ లేకుండానే కట్‌ చేసుకుంటున్నారని జిల్లా వ్యవసాయ అధికారి కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా బ్యాంక్‌ అధికారులు ఆవిధంగా చేయకుండా కంట్రోలింగ్‌ అధికారులు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఋణాల మంజూరుకు పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకోవాల్సిన అవసరం లేనప్పటికీ బ్యాంకు అధికారులు అందుకు విరుద్ధంగా పాస్‌ పుస్తకాలు తీసుకొని రుణాలు మంజూరు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని దీనిని వెంటనే సరిచేయాలని ఆదేశించారు.

జిల్లాలో సంవత్సరం సంవత్సరానికి వరి పంట సాగు విస్తీర్ణం పెరుగుతూ దిగుబడి కూడా పెరుగుతుందని ప్రస్తుత వానాకాలంలో సుమారు 10 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉన్నదని కానీ రైస్‌ మిల్లుల సామర్థ్యం కేవలం 4.20 లక్షల మెట్రిక్‌ టన్నుల మిల్లింగే ఉన్నందున ఈ దిశగా కొత్తగా రైస్‌ మిల్లులు గోదాములు కోల్డ్‌ స్టోరేజ్‌ గోదాముల నిర్మాణాలకు ఆసక్తి కలిగిన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించవలసిన ఉన్నదని, తద్వారా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని సూచించారు. లేదంటే ముందు ముందు వరి ధాన్యం సేకరణ మరింత ఇబ్బంది జరిగే అవకాశం ఉందన్నారు.

ఎర్రజొన్న సాగు చేసే రైతులు వారికి విత్తనాలు అందించే సెంట్రల్‌ లైసెన్స్‌ ఉన్న వ్యాపారులతో వాటిని వారే కొనే విధంగా ముందుగానే ఒప్పందం కుదుర్చుకోవాలని కోరారు. ఈ పంట సాగు చేసే రైతులు నష్టపోకుండా ఉంటారని, ఒప్పందం ఉల్లంఘించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.

జిల్లాలోని మహిళా సంఘాలు చాలా వరకు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తూ ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారని వారు మరింత ముందుకు వెళ్ళడానికి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పెంచాలని బ్యాంకర్లకు సూచించారు. అంతకుముందు ఆర్‌సెటి ద్వారా స్వయం ఉపాధి కింద శిక్షణ పొందినవారు చేసిన వస్తువుల ప్రదర్శనను పరిశీలించారు. ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

సమావేశంలో ఎల్‌డిఎం శ్రీనివాస రావు, ఆర్బీఐ ఎల్‌డిఓ రాజేంద్ర ప్రసాద్‌, నాబార్డ్‌ డిడిఎం నగేశ్‌, డిఆర్‌డిఓ చందర్‌ నాయక్‌, ఎస్బిఐ ఆర్‌ఎం. శ్రీకాంత్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఏజీఎం టీవీఎస్‌ కృష్ణ, సహకార బ్యాంకు సీఈవో గజానంద్‌, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ఆర్‌ ఎం.నారాయణ జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, జిల్లా పశు సంపద అధికారి భరత్‌, ఎస్‌సి కార్పొరేషన్‌ ఈడి రమేష్‌, మెప్మా పిడి రాములు, జిల్లా పరిశ్రమల శాఖ జిఎం బాబురావు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »