కామారెడ్డి, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అసమర్థ పాలన వల్ల 200ల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచడం కేసీఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనమని, రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని భావిస్తే నోటిఫికేషన్లు వెయ్యకుండా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేలా చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అని హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను నిరుద్యోగులు చిత్తు చిత్తుగా ఓడిస్తారు అని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ గడిచిన 8 సంవత్సరాలుగా రాష్ట్రంలో నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఆంధ్ర పాలనలో ప్రతి సంవత్సరం విద్యార్థులకు రావలసిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు వస్తే బంగారు తెలంగాణ అని చెప్పి ప్రగల్బాలు పలుకుతున్న టిఆర్‌ఎస్ పాలనలో రెండు సంవత్సరాలు గడిచినా, ఇప్పటి వరకు ఫీజులు రాకపోవడంతో ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుండి టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొడితేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయని, పథకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలేదని, ఉద్యోగాలు వస్తాయని నమ్మకంతోనే లాఠీ దెబ్బలు తిని, ఆత్మబలిదానాలు చేస్తే కెసిఆర్ కుటుంబానికి 5 ఉద్యోగాలు వచ్చాయే తప్పా, నిరుద్యోగులకు ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో రాలేదన్నారు.
త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. ప్రజలందరూ ఆలోచించి పెన్షన్ల కోసం, పథకాల కోసం టిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే వారి కుటుంబంలో ఉన్న పిల్లలకు ఉద్యోగాలు రావనీ వారు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంటుందన్నారు. కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు అంజల్‌రెడ్డి, సతీష్, సందీప్, నవీన్, రవి తదితరులున్నారు.