నిజామాబాద్, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని రాజారామ్ స్టేడియంలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న వహీద్ మెమోరియల్ జాతీయ ఇన్విటేషన్ ఫుట్‌బాల్ పోటీలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. సెమీ ఫైనల్‌కు చేరిన నాలుగు జట్లను సినీ నిర్మాత దిల్ రాజు అభినందించారు. క్రీడాకారులు బస చేసిన ఎస్‌ఎస్‌ఆర్ డిస్కవరీ పాఠశాలకు వెళ్లి క్రీడాకారులను పరిచయం చేసుకొని వారిని అభినందించారు.
జీవితంలో గెలుపోటములు సహజం కానీ నిజ జీవితంలో ఎన్నడూ ఓడిపోనిది మాత్రం ఒక క్రీడాకారుడు అని అన్నారు. క్రీడాకారులు ఎప్పుడు కూడా గెలుపోటములకు పొంగిపోరు, కుంగిపోరు అన్నారు నిజామాబాద్ నగరంలో ఇంత పెద్ద టోర్నమెంట్ జరుగుతున్నందుకు నిజామాబాద్ జిల్లా వాసిగా గర్విస్తున్నానని దిల్‌రాజు అన్నారు.
క్రీడాకారులకు ఉచిత బస ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌ఆర్ డిస్కవరీ పాఠశాల యజమాని మారయ్య గౌడ్‌ని ప్రత్యేకంగా అభినందించి క్రీడాకారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. పోటీలు నిర్వహిస్తున్న ఫుట్‌బాల్ అకాడమీ అధ్యక్షుడు నరాల సుధాకర్‌ను, మొత్తం కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్న కోచ్ గొట్టిపాటి నాగరాజును ప్రత్యేకంగా అభినందించారు.
నిజామాబాద్ ఈ మధ్య అన్ని క్రీడలకు కేంద్రంగా మారిందని గుర్తు చేశారు. క్రీడల ద్వారా మన పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవచ్చన్నారు. క్రీడాకారులు నిజమైన దేశభక్తులు అని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫాల్గుణ, కేర్ ఫుట్‌బాల్ అకాడమీ అధ్యక్షులు నరాల సుధాకర్, టోర్నమెంట్ నిర్వాహకులు గొట్టిపాటి నాగరాజు, వ్యాయామ ఉపాధ్యాయులు సుబ్బారావు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. శనివారం మొదటి సెమీ ఫైనల్ తమిళనాడు కేరళ మధ్యల జరగగా, రెండవ సెమీఫైనల్ నిజామాబాద్‌కు చెందిన కేర్ ఫుట్‌బాల్ అకాడమీ, తెలంగాణ జట్టు హైదరబాద్-11 మధ్య జరిగింది.