కామారెడ్డి, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఆరోగ్య, ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలు గ్రామాల్లో క్షేత్ర పర్యటన చేపట్టి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని కోరారు.
అర్హత గల అసంఘటిత రంగ కార్మికులకు ఈ- శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసి బీమా సౌకర్యాన్ని కల్పించాలని పేర్కొన్నారు. అంగన్‌వాడి, ఆశ కార్యకర్తలకు భీమా చేయించాలన్నారు. ప్రతి మండలంలో నాలుగు చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులు తక్షణమే పరిష్కరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.