కామారెడ్డి, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఆయన క్యాంప్ కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు.
పరీక్షల నిర్వహణ సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని పేర్కొన్నారు. జిల్లాలో 42 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను నియమించాలని డిఈవో రాజును ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో ఉండే విధంగా వైద్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. టెలి కాన్ఫరెన్స్‌లో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, జిల్లా వైద్య శాఖ అధికారిని కల్పన కాంటే, రెవిన్యూ, ఆర్‌టిసి, విద్యుత్తు శాఖల అధికారులు పాల్గొన్నారు.