నిజామాబాద్, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 15 రోజుల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని లేదంటే సంబంధిత వ్యక్తులకు పాఠశాలలలోకి, రేషన్ దుకాణాల్లోకి, కార్యాలయాలలోకి అనుమతించడం జరగదని, నూటికి నూరు శాతం పక్కాగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తేనే థర్డ్ వేవ్ కోవిడ్ జిల్లాలో రాకుండా కట్టడి చేయడానికి వీలవుతుందని, ఏ కుటుంబం కూడా దుఃఖానికి బాధకు గురి కావాల్సిన అవసరం రాదని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు.
సోమవారం ప్రజావాణి ఫిర్యాదుల కార్యక్రమం అనంతరం వ్యాక్సినేషన్ పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రతి కార్యాలయంలో అటెండర్ నుండి అధికారి వరకు వ్యాక్సిన్ వేయించుకోవలసిందేనని లేకుంటే కార్యాలయంలోకి, పాఠశాలలలోకి, రేషన్ కోసం రేషన్ దుకాణాల్లోకి అనుమతించబడరని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి ఒక్కరు తప్పక రెండు డోస్‌లు తీసుకోవాలని తెలిపారు. ఇందుకోసం మంగళవారం నుండి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, ప్రతి గ్రామం, మున్సిపాలిటీలలో వార్డుల వారీగా టీమ్లు ఏర్పాటు చేసి ఇంకా ఎవరెవరు వ్యాక్సిన్ తీసుకోలేదో జాబితా సిద్ధం చేసి ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేసుకునే విధంగా పకడ్బందీ ప్రణాళిక తయారుచేసి దానిని అమలు చేయాలని ఆదేశించారు. వ్యాక్సిన్ కొరత లేనందున అధికారులు ఈ దిశగా అన్ని ఏర్పాట్లతో జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు అవసరమైన ప్రణాళికలు తయారుచేసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, చిత్రమిశ్ర, జిల్లా పరిషత్ సీఈఓ గోవింద్ నాయక్, డిఆర్‌డిఓ పిడి చందర్ నాయక్, డీఈఓ దుర్గ ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.