కామారెడ్డి, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయవాదుల సహకారంతోనే సత్వర కేసుల పరిష్కారం జరుగుతుందని, బార్ బెంచ్ సంబంధాలు పటిష్టంగా ఉంటేనే, అందరికీ సమన్యాయం జరుగుతుందని కామారెడ్డి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ పేర్కొన్నారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన కామారెడ్డి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతికి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగత కార్యక్రమం బుధవారం బార్ అసోసియేషన్ హాల్‌లో జరిగింది.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ కామారెడ్డి న్యాయవాదుల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన నూతన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో న్యాయవాదులు సహకరించాలని కోరారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని న్యాయవాదుల సమస్యలు తమ దృష్టికి నేరుగా తీసుకురావాలని ఆమె కోరారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి మాట్లాడుతూ బార్ అసోసియేషన్ సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. యువ న్యాయవాదులకు న్యాయమూర్తులు అండగా ఉండాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా కామారెడ్డి బార్ అసోసియేషన్ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిందని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి స్వాతిని బార్ అసోసియేషన్ ప్రతినిధులు శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు జోగుల గంగాధర్, గోనెల జగన్నాథం, శంకర్ రెడ్డి, అబ్దుల్ సలీమ్, దేవేందర్ గౌడ్, గుడ్ల శ్రీనివాస్, లింగాపూర్ శ్రీనివాస్, దేవుని సూర్య ప్రసాద్, లత రెడ్డి, అమీనా బేగం, సీనియర్ న్యాయవాదులు, యువ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.