నిజామాబాద్, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశ కుటుంబ వ్యవస్థ బలం రామాయణం అని, ఆ రామాయణాన్ని అందించిన వాల్మీకి భారత జాతికే ఆచార్యుడని హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. బుధవారం కేర్ డిగ్రీ కళాశాలలో జరిగిన వాల్మీకి జయంతి ఉత్సవంలో ఆయన మాట్లాడారు. రామాయణ కావ్యం ద్వారా లక్షల సంవత్సరాలు అయినా కరిగిపోని మానవ సంబంధాల రహస్యాలను వాల్మీకి ప్రపంచానికి అందించాడని, తరతరాలకు రామాయణం తరగని సంపద అని ఆయన అన్నారు.
తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ రామాయణం అందరూ చదవదగిన కావ్యమని, మనిషి ప్రశాంత జీవితానికి మార్గం వేస్తుందని ఆయన వివరించారు. కార్యక్రమంలో కవి మద్దుకూరి సాయిబాబు, గోరంట్యాల నరేశ్, జి.రాజేంద్ర ప్రసాద్, కొయ్యాడ శంకర్, కవి ఎస్ గంగాధర్, పరిశోధక విద్యార్థి ఎస్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.