కామారెడ్డి, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సైబర్ నేర రహిత జిల్లాగా తీర్చి దిద్దడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం సైబర్ నేరాలపై జిల్లా స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ మాట్లాడారు.
అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి, కష్టార్జితాన్ని ఆన్‌లైన్‌లో పెట్టుబడిగా పెట్టవద్దని సూచించారు. అధిక లాభాలను ఆశించి మోసపోవద్దని కోరారు. మారుతున్న పరిస్థితుల కనుగుణంగా బ్యాంకు వారు ఖాతాదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కేవైసీలను నమోదు చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఖాతాదారుడు తన కేవైసీ వివరాలను బ్యాంకు అధికారుల దగ్గరకు వెళ్లి నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసపూరిత లింకులను ఎస్‌ఎంఎస్‌ల ద్వారా బ్యాంకు ఖాతాదారులకు పంపి కేవైసీ నమోదు చేసుకోగలరని చెప్తున్నారని తెలిపారు.
బ్యాంకు అధికారుల పేరిట ఫోన్ చేసి కెవైసి వివరాలను సేకరించి బ్యాంకు ఖాతాదారుల నుంచి డబ్బులు స్వాహా చేస్తున్నారని పేర్కొన్నారు. కేవైసీ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. కేవైసీ వివరాలు ఏ బ్యాంకు అధికారి ఫోను ద్వారా అడిగారని చెప్పారు. అడిషనల్ ఎస్పీ అన్యోన్య మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకుంటే ఆలస్యం చేయకుండా డయల్ 155260, 100 నెంబర్లకి వెంటనే కాల్ చేసి వివరాలు తెలియ చేయాలని సూచించారు. 24 గంటల లోపు ఫిర్యాదు చేసినట్లయితే పోగొట్టుకున్న డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.