నెలాఖరుకు నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల చివరినాటికి జిల్లాలోని 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి మొదటి డోసు వ్యాక్సినేషన్‌ నూటికి నూరు శాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌డివోలు, స్థానిక సంస్థల అధికారులు, తహసీల్దార్లు ఎంపీడీవోలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో వ్యాక్సినేషన్‌పై మాట్లాడారు.

వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, 18 సంవత్సరాలు దాటిన పౌరులందరికీ తప్పనిసరిగా వ్యాక్సినేషన్‌ వేయించాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారని ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడకుండా ముందుకు వెళ్లాలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారని అందువలన ఈనెలాఖరుకు మొదటి దోస్‌ పూర్తి కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయి అధికారులు ఈ విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమంలో నోడల్‌ ఏజెన్సీగా పనిచేయాలని మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇంటింటికి తిరిగి ఇంకా వ్యాక్సిన్‌ వేసుకోని వారి జాబితాతో పాటు రెండవ డోస్‌ పెండిరగ్‌ ఉన్న వారి జాబితా కూడా వేర్వేరుగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ జాబితాల ప్రకారం ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు.

జిల్లాలో 12 లక్షల 60 వేల మంది వ్యాక్సినేషన్‌ తీసుకోవాల్సి ఉండగా ఇప్పటికీ 7 లక్షల 60 వేల మంది మాత్రమే మొదటి డోస్‌ తీసుకున్నారని మిగతా అందరికి కూడా వ్యాక్సిన్‌ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమం పూర్తయ్యేలా చూడాలన్నారు. అదేవిధంగా సెకండ్‌ డోస్‌ అర్హత వచ్చిన వారికి కూడా రెండో విడత వ్యాక్సిన్‌ ఇప్పించాలని ఆదేశించారు.

జిల్లాలో వ్యాక్సిన్‌ కొరత లేదని సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. తరువాత రబీ సీజన్‌కు వరి పంటకు బదులుగా ఇతర పంటలను వేయించడానికి రైతులకు చైతన్యం కల్పించవలసిన అవసరముందన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకోవాలని పోడు భూముల్లో ట్రెంచ్‌ కటింగ్‌ కొరకు కూలీలకు పనులు కేటాయించాలని ఆదేశించారు. సెల్‌ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్‌, ఆర్‌డివోలు రవి, రాజేశ్వర్‌, శ్రీనివాస్‌, డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌వోలు, డిఐఓ, ఎంపీడీవోలు, తహసిల్దార్‌లు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »