కామారెడ్డి, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విలేజ్ లెవెల్ మల్టీ డిసిప్లీనరీ టీములు ప్రతి ఇంటిని సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్లు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవో, ఎంపీవోలతో నిర్వహించిన టెలి కాన్పరెన్సులో మాట్లాడారు. ఇటీవల ఇతర దేశాలలో కరోనా కేసులు నమోదవుతున్నందున అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి వారం రోజుల్లోగా అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందించవలసిందిగా మంగళవారం రాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారని తెలిపారు.
ఆరోగ్య, ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలు, వీఆర్వో, వీఆర్‌ఏలు ఇంటింటా సర్వే చేపట్టాలని సూచించారు. బృందాలు ఇంటింటా సర్వే చేపట్టి మొదటి డోస్, రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎంతమంది, తీసుకోని వారు ఎంతమంది వంటి వివరాల జాబితాను రూపొందించి అందరు వ్యాక్సిన్ తీసుకునేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. నవంబర్ 3 లోగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల అపోహలు, భయాందోళనలు తొలగించే విధంగా అర్థమయ్యే రీతిలో అవగాహన కలిగించాలని, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని పేర్కొన్నారు.