కామారెడ్డి, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితా ప్రకారం వ్యాక్సినేషన్ కోసం అర్హులైన వారిని గుర్తించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా మండల స్థాయి అధికారులు, మెడికల్ ఆఫీసర్‌లతో మాట్లాడారు. గ్రామస్థాయిలో మల్టీ లెవెల్ డిసిప్లినరీ టీంలు ఇంటింటికి తిరిగి అర్హత గలవారిని గుర్తించాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ మొదటి డోస్, రెండవ డోస్ తీసుకునే విధంగా చూడాలన్నారు. గ్రామస్థాయిలో ఉన్న ఆరోగ్య, ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలతోపాటు వీఆర్‌ఏలు, బూత్ లెవల్ అధికారులు ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలో రోజుకు 15వేల మందికి వ్యాక్సినేషన్ అయ్యేవిధంగా చూడాలని కోరారు. అన్ని మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని మండలస్థాయి అధికారులను ఆదేశించారు.
మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల కోసం గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు లేకపోతే అటవీ భూములను గుర్తించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జడ్పీ సీఈఓ సాయాగౌడ్, ఆర్డీవో శీను, అధికారులు పాల్గొన్నారు.