నిజామాబాద్, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి జీవో నెంబర్ 60 ని వర్తింపచేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర కమిటీ పిలుపు నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీల ముందు నిరసన ప్రదర్శనలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా డిచ్‌పల్లి కేజీబీవీ ముందు నిరసన ప్రదర్శన చేశారు.
ఈ సందర్బంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ పట్ల వివక్షతను, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. మిగతా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచిన ప్రభుత్వం, కేజీబీవీల్లో మాత్రం వేతన పెంపు అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఇది కేజీబీవీల పట్ల, కేజీబీవీల్లో పనిచేస్తున్న మహిళల పట్ల ప్రభుత్వానికి వున్న చిన్నచూపును తెలియజేస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ని కేజీబీవీ నాన్-టీచింగ్ అండ్ వర్కర్స్‌కు వర్తింపజేయాలన్నారు. జీ.వో నెంబర్ 60 ప్రకారం కుక్, అటెండర్, స్వీపర్, స్కావెంజర్, వాచ్ వుమెన్‌లకు నెలకు 15 వేల 600, కంప్యూటర్, ఒకేషనల్ ఇన్ స్ట్రక్టర్‌లకు 19 వేల 500, అకౌంటెంట్, ఏఎన్‌ఎంలకు 22 వేల 750 వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
2021 జూన్ నెల నుంచి వేతన పెంపు అమలు చేయాలన్నారు. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం తమను శ్రమదోపిడి గురి చేసిందని, ఇకనైనా వేతన పెంపు చేయాలన్నారు. లేకపోతే ఐ.ఎఫ్.టీ.యూ ఆధ్వర్యంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ సిబ్బంది సుజాత, పద్మ, విజయ, కరుణశ్రీ, భాగ్య, మంజుల, పార్వతి, కళావతి, చంద్రకళ, జమున తదితరులు పాల్గొన్నారు.