నిజామాబాద్, అక్టోబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా శుక్రవారం తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వచ్చే జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని యువతీ యువకులు ఓటర్ల జాబితాలో తమ పేర్ల నమోదు ఆదేశాలు జారీ చేసిందని వచ్చిన దరఖాస్తులకు అనుగుణంగా నవంబర్ 1న డ్రాఫ్ట్ లిస్టు ప్రచురిస్తామని రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పంపిస్తామని ఒక లిస్టు పోలింగ్ కేంద్రాల బిఎల్‌వోల వద్ద ఉంటుందని ప్రజలు, ఓటర్లు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ఆ జాబితాలో సరిచూసుకొని మార్పులు చేర్పులకు అభ్యంతరాలకు దరఖాస్తు చేయాలని తద్వారా తప్పులు లేని ఓటర్ల జాబితా సిద్ధం చేయడానికి వీలవుతుందని ఆయన సూచించారు. జనవరి 5 వ తేదీన చివరి ఓటర్ల జాబితా ప్రచురిస్తామని తెలిపారు.
నవంబర్ 6, 7, 27, 28 తేదీలలో ప్రత్యేక డ్రైవ్ ఓటర్ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ తేదీలలో సంబంధిత పోలింగ్ కేంద్రాలలో బిఎల్‌వోలు సంబంధిత 6, 7, 8, 8 ఫారాలతో అందుబాటులో ఉంటారని ప్రజలు వారి వద్ద కొత్తగా నమోదు, మార్పులు చేర్పులు, తప్పులు సరి చేయడం, పోలింగ్ కేంద్రాల మార్పు, నియోజకవర్గాల మార్పులకు సంబంధించి ఫారాలు తీసుకొని పూర్తి చేసి సమర్పించాలని కోరారు. దరఖాస్తులు మ్యానువల్ గానే కాకుండా ఆన్‌లైన్ ద్వారా కూడా పొందవచ్చన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ విషయంలో తగు శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరు తమ అర్హతకు అనుగుణంగా ఈ ఫారాలలో దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో నిజామాబాద్ ఆర్టీవో రవి, ఎలక్షన్ ఇన్చార్జ్ పర్యవేక్షకులు సాగర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.