ధరణి ప్రారంభమై ఏడాది పూర్తి, అత్యంత సులభ, రక్షణ పోర్టల్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత సంవత్సరం అక్టోబర్‌ 29న ప్రారంభమైన ధరణి పోర్టల్‌ ద్వారా రైతుల ఎన్నో సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారికి జారీచేసిన పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రయోజనాలు వర్తించాయని ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు కష్టపడి ఎన్నో సమస్యలను పరిష్కరించారని వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు.

ధరణి పోర్టల్‌ ప్రారంభమై ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రైతుల బాగు కోసం ధరణిని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిందని ఈ ఏడాది కాలంలో ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో భూ సమస్యలకు పరిష్కారం లభించిందని పేర్కొన్నారు. దీని ద్వారా రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలు అందించామని దానితో రైతులకు ఒక ఆత్మవిశ్వాసం, నమ్మకం కలిగి బ్యాంకులో పాస్‌బుక్కుల లాగా వాటిని భావించారని వాటి ద్వారానే అందులో ఉన్న భూ విస్తీర్ణం ఆధారంగా రైతులు తమ భూములకు సంబంధించి క్రయ విక్రయాలు, బదిలీలు చేసుకోగలుగుతున్నారని, పంట రుణాలు పొందుతున్నారని, రైతుబంధు తదితర కార్యక్రమాల ద్వారా వారికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

ధరణి పోర్టల్‌ ద్వారా పార్టు-ఏ లో రాష్ట్రస్థాయిలో తహసీల్దార్లు 10 లక్షల 973 దరఖాస్తులను, జిల్లా స్థాయిలో 14 వేల 972 దరఖాస్తులు, అదేవిధంగా పార్టు – బి లో రాష్ట్రస్థాయిలో 5 లక్షల 17 వేల దరఖాస్తులు, జిల్లా స్థాయిలో 13,328 దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని, సంవత్సర కాలంలోనే ఇన్ని దరఖాస్తులను పరిష్కరించడం రెవెన్యూ అధికారుల అంకితభావానికి నిదర్శనమని తెలిపారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో రేయింబవళ్ళు కష్టపడి పని చేయడం వల్లనే ఇది సాధ్యమైందని వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. జిల్లాలో ఇంకా 989 దరఖాస్తులు మాత్రమే కోర్టు కేసులు క్లిష్టమైన కేసులు పెండిరగ్‌లో ఉన్నాయని కొద్దిరోజుల్లోనే వీటిని కూడా అధికారులు పరిష్కరిస్తారని తెలిపారు. క్లియర్‌ చేసిన కేసులను ఎక్కడి నుండైనా చెక్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించి పరిష్కరించడం ద్వారా అర్హులకే న్యాయం జరిగిందని ఒక్క కేసు కూడా ఒకరిది ఒకరికి వచ్చినట్లు ఫిర్యాదు రాలేదని తెలిపారు. ఒక కేసులో ఒక కోటి రెండు లక్షల రూపాయలకు అటెంప్టివ్‌ కేసు వచ్చినప్పటికీ ప్రజాధనం వృధా కాకుండా పరిష్కరించామని ధరణి విషయంలో తనకు పూర్తి సంతృప్తి ఉన్నదని వివరించారు.

అంతకుముందు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, ధరణి ప్రారంభానికి ముందు భూముల విషయంలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయని రైతులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారని కానీ 2016- 17 సంవత్సరంలో సేకరించిన ఎల్‌ఆర్‌యుపి వివరాల ఆధారంగా ధరణిలో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందని మ్యుటేషన్లు, రిజిస్ట్రేషన్లు వేగంగా, సాఫీగా జరుగుతున్నాయని తెలిపారు.

కార్యక్రమంలో నిజామాబాద్‌ ఆర్డిఓ రవి, కలెక్టరేట్లోని పర్యవేక్షకులు, సిబ్బంది, తహసిల్దార్‌ ప్రశాంత్‌, ధరణి ఇంచార్జ్‌ గోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »