కామారెడ్డి, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూముల సంరక్షణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం రాజకీయ పార్టీల నాయకులతో అటవీ భూములు సంరక్షణ, పోడు వ్యవసాయంపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు పోడు భూములు సాగు చేసిన రైతుల వివరాలు అధికారులు సేకరిస్తారని చెప్పారు. అర్హతగల లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చెప్పారు. మానవ మనుగడకు అడవులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
అటవీ, రెవెన్యూ అధికారులతో సంయుక్త సర్వే చేపడతామని చెప్పారు. అటవీ భూములను ఆక్రమిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఎఫ్‌వో నిఖిత, ఆర్డిఓ శీను, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, సూపరింటెండెంట్ వరప్రసాద్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.