డిచ్‌పల్లి, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చట్టం ముందు మహిళలు, పురుషులు సమానమేనని హైకోర్టు జడ్జి విజయ సేన్ రెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండలం నడ్పల్లిలోని జీ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆజాద్ కా అమ ృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామానికి చట్టాలపై అవగాహన కల్పించడానికి కృషి చేయాలని సూచించారు. ఉచిత న్యాయ సేవ ద్వారా పేద ప్రజలకు సంపూర్ణ న్యాయం అందించడమే లక్ష్యం అన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య, పేద ప్రజలకు ఉచితంగా న్యాయం అందించాలని సూచించారు. చట్టంలో సర్వ హక్కులు ఉంటాయని, వాటిని ప్రజలు అవసరానికి వినియోగించుకోవాలని కోరారు. గ్రామ స్థాయిలో చట్టాలపై నిరంతరం అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు.
నవంబర్ 14 వరకు గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. నిరుపేదలకు అన్యాయం జరిగితే న్యాయం కోసం ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయ సేవ కార్యక్రమాల సవనీర్‌ను విడుదల చేశారు. పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. వైద్య శిబిరాన్ని హైకోర్టు జడ్జి ప్రారంభించారు. సమావేశంలో నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జడ్జీలు గోవర్ధన్ రెడ్డి, గౌతమ్ ప్రసాద్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ అరవింద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి, న్యాయవాదులు, వైద్యులు పాల్గొన్నారు.