బోధన్, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు పాలక పార్టీలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడుకొనుటకు ఐక్యఉద్యమాలు శరణ్యమని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం బోధపట్టణం తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ భవన్‌లో సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసి పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో రైతులు వరిపంటను సాగు చేయొద్దని అధికారులు చెబుతున్నారని, మరోప్రక్క తెరాస నాయకులు కేంద్రం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయనని చెబుతోంది అందుకే రైతులకు వరి పంట వేయొద్దని చెబుతున్నామని, ఇంకో పక్క బీజేపీ పార్టీ నాయకులు రైతులకు మద్దతుగా దీక్షలు చేస్తున్నారని, దీంతో రైతులు వరి పంట సాగు చేయాలా? సాగు చేయకూడదా ? అని అయోమయానికి గురవుతున్నారని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ ఎస్ పార్టీలు రైతులను మోసం చేయుటలో రెండూ, రెండేనని అన్నారు.
వరి ధాన్యాన్ని నిల్వ చేయడానికి గోదాములు లేవని ప్రభుత్వం చెబుతోందని, ఆహార పదార్థాలు అందించడంలో మన దేశం 137 వ స్థానంలో ఉన్నామన్నారు. మరోవైపు అదాని, అంబానీలు వందల ఎకరాల్లో గోదాముల నిర్మాణాలు చేపడుతున్నారని రేపు వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే కుట్రజరుగుతుందని అందులో భాగమే మూడు రైతు వ్యతిరేక చుట్టాలు తెచ్చారని వాటికి వ్యతిరేకంగా కలిసి పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు.
సమావేశానికి బి.మల్లేష్ అధ్యక్షత వహించగా ఇందులో డివిజన్ కార్యదర్శి కే. గంగాధర్, సీపీఐ (ఎం-ఎల్) పార్టీ నాయకులు డి. రాజేశ్వర్, టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి హన్మంత్ రావ్, సీపీఎం పార్టీ నాయకులు జే. శంకర్ గౌడ్, యేశాల గంగాధర్, రైతు వెంకట రమణ రెడ్డి, ఎఐకేఎంఎస్ నాయకులు గుమ్ముల గంగాధర్, పడాల శంకర్, సుల్తాన్ సాయులు, పీ. నాగన్న, పీ. రాజేశ్వర్, ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు.