నిజామాబాద్, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వట్టికోట ఆళ్వార్ స్వామి సాహితీవేత్త, సాహిత్య ప్రచారకుడు, గ్రంథాలయ ఉద్యమ యోధుడు, పత్రికా సంపాదకుడు, తెలంగాణ అస్తిత్వాన్ని బలంగా నిలబెట్టిన మట్టి బిడ్డ అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. సోమవారం కేర్ డిగ్రీ కళాశాలలో జరిగిన వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆయన రాసిన ప్రజల మనిషి, గంగు నవలల్లో మొత్తం నిజామాబాద్ కామారెడ్డి ప్రాంతాల జనజీవనం, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాయుధ పోరాట పరిస్థితులకు అద్దం పడుతుందని వివరించారు. ఈ సందర్భంగా వట్టికోట ఆళ్వారుస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ప్రముఖ కవులు తిరుమల శ్రీనివాసాచార్య, కంకణాల రాజేశ్వర్, ప్రిన్సిపల్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.