నిజామాబాద్, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయ అధికారులు ధాన్యానికి ఎఫ్ఏక్యూ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా మిల్లర్లు కడ్తా తీస్తే ఆ మిల్లును క్లోజ్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం క్యాంపు కార్యాలయం నుండి సెల్ కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో పర్యటించి పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఆయన గమనించిన విషయాలను అధికారులకు తెలిపారు. నందిపేట, నవీపేట, మాక్లూర్ తదితర పెద్ద కొనుగోలు కేంద్రాలలో సరిపోయే విధంగా పెద్ద మొత్తంలో గన్ని బ్యాగులు ఉండేలా చూడాలని ఈ విషయంలో కొరత రానీయవద్దని అధికారులకు సూచించారు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తప్పకుండా వ్యవసాయ అధికారులు పరిశీలించి ఎఫ్ఏక్యూ ఉన్న ధాన్యానికి ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని ఆ తర్వాతనే ధాన్యాన్ని తూకం వేసి రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించారు. ధ్రువీకరణ లేకుండా ఎట్టి పరిస్థితిలో మిల్లులకు ధాన్యాన్ని పంపవద్దని స్పష్టం చేశారు. వ్యవసాయ అధికారులు నాణ్యమైన ధాన్యానికి ధ్రువీకరణ చేసిన తర్వాత కూడా మిల్లర్లు కడ్తా తీస్తామంటే ఆ మిల్లులను సీజ్ చేయాలని ఆదేశించారు.
90 శాతం పైగా రైతులు పూర్తి స్థాయిలో నిజమైన ధాన్యాన్ని తీసుకువస్తున్నట్లు తన పర్యటన ద్వారా గమనించడం జరిగిందన్నారు. అయినా కూడా మిల్లర్లు కొర్రీలు పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. లారీల కాంట్రాక్టర్లు ఒక్కొక్కరు 150 లారీలు పంపించాలని వాటిని అదనపు కలెక్టర్ ఆర్డివోలు, తాసిల్దార్ పర్యవేక్షణ చేస్తూ రైస్ మిల్లులకు రవాణాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.
కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిల రైతుల నుండి సేకరించిన ధాన్యం వివరాలను, రైతులకు సంబంధించిన ఆధార్, బ్యాంక్ ఖాతా తదితర వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, తద్వారా రైతులకు వీలైనంత త్వరగా ధాన్యం డబ్బులు చెల్లించడానికి వీలవుతుందని పేర్కొన్నారు.
కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిసిఓ సింహాచలం, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, ఆర్డివోలు రాజేశ్వర్, శ్రీనివాస్, రవి, పౌరసరఫరాల అధికారులు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.