నిజామాబాద్, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్‌తో ఇంటి పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమని, బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి స్వచ్చంధ సంస్థలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కేర్ ఇండియా స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ అధికారులు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు నిత్యవసరాల కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కొవిడ్ మహమ్మారి చాలా మంది కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చిందన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఎంతో మంది పిల్లలు అనాదలుగా మారారని తెలిపారు. ఇలాంటి వారికి ప్రభుత్వం సహాయం అందిచడమే కాకుండా, స్వచ్చంధ సంస్థలు ముందుకు వచ్చి నిత్యావసర సరుకులు అందిచాయన్నారు. ఇందులో భాగంగా కేర్ ఇండియా సంస్థ మంగళవారం జిల్లాలో 142 మంది తల్లి దండ్రులు లేని చిన్నారుల కుటుంబాలకు బియ్యం, పప్పులు, వంట నూనె, గొడుమపిండి, ఇతర సారుకులతో కూడిన కిట్లను అందజేసి ఆదుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు.
కార్యక్రమంలో ఐసిడిఎస్ ఇంచార్జి పిడి రaాన్సీ లక్ష్మీ, అర్బన్ సీడీపీవో సౌందర్య, సూపరింటెండెంట్ ఇందిరా, బాల రక్ష భవన్ కో ఆర్డినేటర్ స్వర్ణలత, డీసీపీవో చైతన్య కులకర్ణి, సూపర్ వైజర్ నందిని, డీసీపీయూ, చైల్డ్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు.