బోధన్, నవంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భవన, ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులకు పాలకులు మెరుగైన సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలంగాణ ప్రగతి శీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (ఐఎఫ్‌టీయూ) జిల్లా కార్యదర్శి బి.మల్లేష్ డిమాండ్ చేశారు.
బుధవారం బోధన్ పట్టణం రాకాసిపేట్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో బి.మల్లేష్ మాట్లాడుతూ నేడు నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు ఎలాంటి సామాజిక భద్రత, రక్షణ లేని స్థితి వున్నదని కార్మిక చట్టాలు అమలు కాని స్థితిలో చాలీచాలని బ్రతుకులను వెళ్లదీస్తున్నారని, కుటుంబాలు గడవటానికి సరిపడా ఆదాయం లేక, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దెలు చెల్లించ లేని దైన్య స్థితిలో నిర్మాణ రంగ కార్మికులున్నారని వివరించారు.
నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు రక్షణ పరికరాలు లేక, ప్రమాదకరమైన పనులు చేసే సమయంలో మరణిస్తే, వారి భార్య, పిల్లలు అనాధాలుగా మారుతున్నారన్నారు. అనేక పోరాటాల ఫలితంగా భవన ఇతర నిర్మాణ రంగ కార్మిక చట్టం 1998 లో వచ్చిందన్నారు. అయినా పాలకులు కార్మికులకై సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యాన్ని చిత్త శుద్ధితో అమలు చేయడం లేదని మండిపడ్డారు.
దేశ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల సెస్ వసూలు చేస్తున్న వాటిని వారి సంక్షేమం కోసం ఖర్చు చేయక పోవడం వల్ల వేల కోట్ల రూపాయల నిధి నీటికి మూలుగుతున్నదని అన్నారు. కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్‌లు అందించాలని, సామాజిక భద్రత క్రింద వృద్దాప్య పెన్షన్ 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాద మరణానికి 10 లక్షలు, సహజ మరణానికి 2 లక్షలు ఇవ్వాలని, ప్రసూతి సహాయం 50 వేలు, పెళ్లి కానుక 1లక్ష రూపాయలు పెంచి ఇవ్వాలని అన్నారు. సమావేశంలో లియకత్, తన్వీర్, రఫిక్, ఎస్ కే అక్బర్, ఎస్ కే ఆవేజ్, అరీబ్, మీరాజ్, కార్మికులు పాల్గొన్నారు.