నిజామాబాద్, నవంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూముల సమస్యను పరిష్కరించుటకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు చట్టానికి అనుగుణంగా చర్యలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లాల కలెక్టర్లను సంబంధిత అధికారులను కోరారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లు, డి.ఎఫ్.ఓలు, అదనపు కలెక్టర్లు, డి.పి.ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇచ్చిన ఆదేశములకు అనుగుణంగా పోడు భూముల సమస్యను పరిష్కరించుటకు ఎఫ్.ఆర్.సి లతో పాటు గ్రామ పంచాయతీ, మండల, డివిజన్, జిల్లా స్థాయి బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో భాగంగా మొదటగా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తుల నుండి క్లయిమ్‌లను స్వీకరించుటకు ఆవాసాల వారిగా సరిపడా ఫారమ్ ఎ లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
అదే విధంగా పూర్తి చేసిన ఫారమ్-ఎ దరఖాస్తులను అందజేసేందుకు గ్రామస్తులకు తగినంత సమయాన్ని ఇవ్వాలని సూచించారు. పోడు భూములపై గ్రామస్తుల నుండి ఫారమ్ ఎ ప్రకారం క్లయిమ్‌ల స్వీకరణ, అవగాహన కార్యక్రమాలను ఈ నెల 8 వ తేదీ నుండి ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ అంశంపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపారు.
పోడు భూములపై గ్రామస్తులకు అవగాహన కల్పించి, పూర్తి చేసిన క్లయిమ్‌లు స్వీకరించుటకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆవాసాల వారిగా గ్రామ పంచాయతీ స్థాయి బృందాలు, ఎఫ్.ఆర్.సిలు గ్రామస్తుల నుండి పూర్తి చేసిన క్లయిమ్‌లను తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఈ సమస్య పరిష్కారానికి 131 బృందాలు ఏర్పాటు చేశామని, 197 ఉన్నాయని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, పోడు భూముల చట్టం ప్రకారం తగు చర్యలకు ఆదేశాలు జారీ చేశామని సిఎస్‌కు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అటవీ అధికారి సునీల్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగోరావు, సిఎస్‌తో పాటు అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్ సి.సి.ఎఫ్. శోభ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ కమీషనర్ శేషాద్రి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టినా జడ్ చొంగ్తు, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్‌డి ప్రియాంకా వర్గీస్, అడిషనల్ పిసిసిఎఫ్ ఎన్.సి పరాజిన్, అడిషనల్ పిసిసిఎఫ్ స్వర్గం శ్రీనివాస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.