నిజామాబాద్, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం మాక్లుర్ మండలం భోంకన్పల్లి, ముల్లంగి, మందాపూర్, గోట్టుముక్కల గ్రామాల్లో గడపగడపకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాందాపూర్ గ్రామంలో జరిగిన సమావేశంలో ప్రజలనుద్దేశించి న్యాయ సేవా అధికార సంస్థ పానల్ న్యాయవాది జగన్మోహన్ గౌడ్ మాట్లాడారు.
రాజ్యాంగం కల్పించిన సమాన న్యాయం ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆజాదీకా అమృత ఉత్సవ్ పాన్ ఇండియా న్యాయ అవగాహన కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామాన గడపగడపకు చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సాధ్యమైనంత వరకు ప్రజల వాడక భాషలోనే అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
ప్రతి వ్యక్తి చట్ట పరిజ్ఞానం పొంది ఉండాలని తెలిపారు. పోక్సోచట్టం, లోక్ అదాలత్, ఉచిత న్యాయ సేవలు వివిధ చట్టాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అనంతరం ఇంటింటికి న్యాయ అవగాహన కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముల్లంగి పంచాయతీ కార్యదర్శి రాధిక, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సుపరింటెండెంట్ పురుషోత్తం, ఇందూరు యువత అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, గ్రామ కార్యదర్శులు సర్పంచులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.