హైదరాబాద్, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో బెయిల్ రావడంపై తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజల పక్షాన ప్రశ్నించే జర్నలిస్టులకు రక్షణ లేదు అనడానికి తీన్మార్ మల్లన్న పరిస్థితి నిదర్శనమన్నారు.
అవినీతి, అక్రమాలను బయట పెట్టడం జరిగినప్పుడు ప్రభుత్వం, మంత్రులు స్పందించి వాటిని పెంచి పోషిస్తున్న వారిపై సహకారం అందిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి కానీ అందుకు విరుద్ధంగా ప్రశ్నించినందుకు జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయడం, దూషించడం, మానసికంగా, నైతికంగా వారిని దెబ్బతీయడం టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో పరిపాటిగా మారిందన్నారు.
గతములో ఏ ప్రభుత్వంలో జరగని అవినీతి అక్రమాలు టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయని అధికారులపై చర్యలు తీసుకోకుండా పాలకులు చోద్యం చూడడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. అందుకోసమే దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రం అవినీతి అక్రమాలలో మొదటి స్థానంలో ఉందన్నారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత తీన్మార్ మల్లన్న బెయిల్‌పై వస్తారని ముందే ఊహించడం జరిగిందని దీన్ని బట్టి చూస్తే ప్రశ్నించే జర్నలిస్టులను మన పాలకులు ఎన్ని రోజులు జైల్లో పెట్టాలో ముందే నిర్ణయించుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు బ్రతికే స్వేచ్ఛ కల్పించాలని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం హైకోర్టును కోరుతుందన్నారు.